జీవధారలు
నీ హృదయములోనుండి
జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకొనుము. సామెతలు. 4:23
ధ్యానాంశం : హృదయం ( మొదటి భాగం )
బైబిల్ నందు దేవుని వాక్యం పాలు ( 1పేతురు.2:3), బంగారం,తేనె (కీర్తన.19:10; 119:103),
ఆహారము (యెహెజ్కేలు.3:3), అగ్ని,సుత్తె
(యిర్మీయా.23:29), ఖడ్గము (హెబ్రీ.4:12), అద్దము (యాకోబు.1:23), వర్షము,హిమము (యెషయా.55:10), విత్తనము (మార్కు.4:3-8),
దీపము (కీర్తనలు.119:105), నీరు (ఎఫెస్సీ.5:26) మొదలైన వాటితో పోల్చబడింది.
దేవుడు తన పోలికలో మనలను సృస్టించింది
తనవలే జీవించాలని, తన మాటలు మన నోటి నుండి రావాలని.
నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా.51:16.
ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. యిర్మీయా.5:14.
దేవుడు తన శ్రేష్టమైన మాటలను మన
నోటిలో ఉంచాడు. పవిత్రమైన పెదువులు (జెఫన్యా.3:9) కలిగిన వారమై ఆయనను స్తుతించాలని
ఆశపడుతున్నాడు. కానీ మనము ఆయనను స్తుతించడానికి ప్రార్థించడానికి ఎప్పుడు వాయిదాలు
( postpone) చేస్తూనే వస్తాము. విశ్వాసులను కొన్ని చోట్ల ప్రార్థన చేయడానికి
పిలిచినప్పుడు వణికిపోతూ ఉంటారు. దానికి కారణం దేవుని మీద ఉండే భయం కాదండోయ్. వారి
జీవితంలో ప్రార్థన లేకపోవడమే. ఏవిధంగా ఆయనను ప్రార్థించాలి ?
ఎలా స్తుతించాలో చాలా మందికి తెలియక పోవుటకు గల కారణం హృదయంలో స్తుతి లేకపోవడము, హృదయము నిండియుండక పోవడము. దేవుడు
ఏం అంటున్నాడో తెల్సా?...
హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు
మాటలాడును. లూకా.6:45.
మన హృదయంలో ప్రార్థన నింపబడి
ఉంటే ప్రార్థన వస్తుంది. స్తుతి నింపబడి ఉంటే స్తుతి వస్తుంది. అది కాకుండా నిన్న
చూసిన సినిమానో, ఆ సినిమాలో విన్న పాటలు డైలాగులు హృదయంలో నింపబడి ఉంటే ఇంకా ప్రార్థన
స్తుతి ఎక్కడ నుండి వస్తుంది? కొన్ని సంవత్సరాల క్రితం చూసిన సినిమా కథంతా అనర్గళంగా చెప్పగలుగుతావు.
గత రాత్రి చూసిన సీరియల్ సన్నివేశాలు హృదయమంతా నింపుకొని నేటి రాత్ర్రి కోసం ఎదురు
చూస్తూ ఉంటావు. స్నేహితులు నేర్పించే బూతు మాటలు హృదయమంతా నింపుకుంటావు. అందుకే
హృదయం నింపబడిన దాని గురించి నోరు మాట్లాడుతుంది. ఇవన్నీ హృదయంలో నింపబడిన తర్వాత
ప్రార్థన, స్తుతి ఎలా వస్తుంది?
చాలా మంది జీవితాల్లో వారి
హృదయం పాపపు తలంపు, పాపిష్టి ఆలోచనలు, మోసకరమైన యోచనలు, ఓర్వలేనితనం, కీడు చేయాలనే కోరిక, గర్వపు మాటలు మొదలైన వాటితో నింపబడి ఉంటుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు.
మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును
జారత్వములును దొంగతనములును, నరహత్యలును వ్యభి చారములును లోభములును
చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.మార్కు.7:21,22.
హృదయమందు ఇవన్నీ నింపబడియుండగా
ప్రార్థన, స్తుతి
రావడం అసంభవం. అంధుకే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాసిన జాన్ బన్యన్ అనే
ఒక భక్తుడు అంటాడు – “ ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. అట్లే పాపం ప్రార్థన
చేయకుండా ఆపుతుంది ”. మన హృదయంలో ఉన్న ఈ పాపపు లక్షణాలను తొలగించమని ఆ దేవుణ్ణి
అడిగితే ఆయన నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన నీ నోట ఆయన మాటలను
ఉంచుతాడు. అప్పుడు పాపమునకు నీ హృదయములో స్థానం ఉండదు.
ఒకవేళ అదే పాపములో జీవిస్తూ
కనుక నీవు ఎంత ప్రార్థించిన ఎంత ఉపవాసమున్న ఆయన నీ ప్రార్థన ఆలకించడు. దేవుడు
పాపుల మనివి ఆలకింపడని యెరుగుదుము. యోహాను.9:31.
ఒక సారి ఆయన పాదముల దగ్గరికి
వచ్చి ఆయనను మనము క్షమించమని అడుగుదాము.
(సశేషం)
దేవుని నామమునకు మహిమ
కలుగును గాక ! ఆమెన్
మీ
సహోదరుడు లాజర్
జీవధారలు
నీ హృదయములోనుండి
జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకొనుము. సామెతలు. 4:23
ధ్యానాంశం : హృదయం ( రెండవ భాగం )
గత భాగంలో మనం హృదయము
నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును అని , హృదయములో ఏమి నిండి ఉన్నాయో
తెలుసుకున్నాము. ఇప్పుడు మన నోరు ఏమి మాట్లాడుతుందో చూద్దాము.
మన నోటి నుండి వచ్చే ప్రతి
పలుకు కూడా హృదయంలో ఉంటే తప్ప అది బయటకు రాదు. అది బయటకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా
హృదయంలో ఉండి తీరాల్సిందే. హృదయంలో ఉన్న మాటలు బయటకు రావడానికి నాలుక సాదనంగా పని
చేస్తుంది. అయితే మన నాలుక ఎలాంటిదో అది చేసే పనులేమిటో ఆయన వాక్యపు వెలుగులో
ధ్యానించుకుందాము.
ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు
లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన
శక్తిగలవాడగును. గుఱ్ఱములు మనకు
లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా! ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును
ఎంత కొంచెము నిప్పు
ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై
సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు
చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను
సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. యాకోబు. 4: 2-8.
యేసు యొక్క సహోదరుడైన యాకోబు తన
పత్రికలో నాలుక గురించి వివరించి చెబుతున్నాడు. నాలుక అగ్నితోనూ, పాప
ప్రపంచముతోనూ పోల్చి మరణకరమైన విషముతో
నిండి ఉందని, అది దుష్టత్వమని చెబుతున్నాడు.
నిజమే! లోకంలో చాలా మంది
నాలుకలు ఈ విదంగానే ఉన్నాయి. కొంతమంది నాలుకలు బాణముల ( యిర్మీయా.9:8) వలె ఉండి తన
పొరుగువారిని గాయపరుస్తాయి. సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఇతరుల మనసును నొప్పిస్తాయి.
అందుకే కీర్తనల గ్రంధంలో భక్తుడు అంటాడు కదా! ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు
తమ నాలుకలకు పదును పెట్టుదురు. కీర్తనలు. 64:3.
పదునైన కత్తి దేనినైనా ఎంత
సులభంగా ముక్కలు చేస్తుందో అలాగే కొందరి నోటి నుండి వచ్చే మాటలు కూడా హృదయమును
అలాగే ముక్కలు చేస్తాయి. భక్తిహీనులు మరియు అన్యజనుల వలె క్రైస్తవులు కూడా తమ
నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇతరులను ఇరుగుపొరుగు వారిని దుర్భాషలాడడం శపించడం
చేస్తూ ఉంటారు. ఇవి హృదయములో నిండి ఉండకపోతే నోటి నుండి ఎలా వస్తాయి?
దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. యాకోబు. 3:9.
నీ హృదయంలో స్తుతి నింపబడితే
నోటి నుండి కూడా స్తుతియే బయటకు వస్తుంది. నీ నోటి నుండి స్తుతి వస్తుంది అలాగే
శాపం కూడా వస్తుంది అంటే నువ్వు వెచ్చగానైననూ చల్లగానైననూ లేక నులి వెచ్చగా
ఉన్నావని అర్థం. అలా ఉంటే
దేవుడెమంటున్నాడో తెల్సా? నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు
గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ప్రకటన.3:16.
ప్రియులారా! నీ హృదయంలో
దీవెనవచనములు మరియు శాపవచనములు ఉండకూడదు. ఉంటే గనుక అవి నీ నోటి నుండి బయటకు వచ్చి
నిన్ను అపవిత్ర పరుస్తాయి. దేవుడు నిన్ను ఉమ్మివేస్తాడు.
మరి కొందరి నోటిలో ఎప్పుడు
విన్న చావు వార్తనే వినిపిస్తూ ఉంటుంది. తన చావును కోరుకోవడమో లేక ఇతరుల చావును
కోరడమో ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. అంటే వారి హృదయము చావు అనే విషయంతోనే నిండి
ఉంది. వారి ఊహ ఎల్లపుడూ చావు గురించే. అందుకే వారి జీవితంలో మరణం సంభవిస్తుంది.
మరి నీ నోటిలో ఏ మాట వినిపిస్తుంది? మంచి వార్తనా?
లేక మరణ వార్తనా? జీవమరణములు నాలుక వశము దానియందు
ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. సామెతలు.18:21.
మరి కొందరి నాలుకలు ఎలా
ఉంటాయంటే ... ఆకాశముతట్టు వారు
ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును. కీర్తనలు. 73:9. నిజమే కదా!
సంఘములో ఉన్నప్పుడూ వాక్యం విని అలా జీవించాలని అనుకుంటారు. అదే బయటకు వచ్చాక
అన్నీ కూడా లోక సంబంధమైన మాటలు అందుకే వారి జీవితంలో ఒక్క పాట రాదు. ప్రార్థన
చేయాలంటే భయం. స్తుతి రాదు. మాట్లాడేవన్ని కూడా లోక సంబంధమైన మాటలు తప్ప ఒక్కసారి
కూడా పరలోక సంబంధమైన మాటలు కానీ పాటలు కానీ రావు. ఇలా చేస్తూ ఉంటే నీ హృదయంలో ఏం
నిండుతుంది? నిండిన హృదయంలో నుండి ఏం బయటకు వస్తుంది? మెమొరీలో
మనం ఏదైతే నింపుతామో దాన్ని ప్లే చేసినప్పుడు కూడా అదే బయటకు ఎలా వస్తుందో అలాగే
నీ హృదయంలో ఏం నింపబడుతుందో అదే బయటకు వస్తుంది.
యెషయా ప్రవక్త తన మాటలను బట్టి దేవుణ్ణి
నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని మనివి చేసినప్పుడు సెరాపులలో ఒకడు బలిపీఠము
మీద నుండి కారుతో తీసిన నిప్పును ప్రవక్త నోటికి తగిలించగా ఎలా
ప్రాయశ్చిత్తమయ్యిందో (యెషయా.6:5) అలాగే నీవు ప్రార్థిస్తే అగ్ని వంటిదైన ఆయన
వాక్యం ద్వారా నీ నోరు పవిత్రపర్చబడుతుంది. నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపేదను
(కీర్తన.81:10) అని సెలవిచ్చాడు. అందుకే వారి హృదయములో నుండి ఎల్లప్పుడు స్తుతి
బయటకు వచింది. నా నాలుక నీ
నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. కీర్తన.35:28.
నీ
నోటి మాటల ద్వారా నీ హృదయం నింపబడుతుంది. నింపబడ్డ హృదయం నోటి మాటల ద్వారా బయటకు
వస్తుంది. అందుకే నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకొనుము.
దేవుని కృప మీకందరికి తోడైయుండును
గాక! అమెన్ !!
మీ
సహోదరుడు లాజర్.
జీవధారలు
నీ హృదయములోనుండి
జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకొనుము. సామెతలు. 4:23
ధ్యానాంశం : హృదయం ( మూడవ భాగం )
నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. రోమా.9:1.
పౌలు రోమా సంఘానికి పత్రికను
రాస్తూ చెబుతున్నా మాటిది. పౌలు హృదయంలో దుఃఖము మరియు మానని వేదనలున్నాయి. హృదయంలో ఏం నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుందని
చూసాము కదా మరి దుఖం వేదన నిండి ఉంటే నోటి నుండి ఎలాంటి మాటలు బయటకు వస్తాయో
వాక్యపు వెలుగులో చూద్దాము.
పరిశుద్ద గ్రంధములో మనం
గమనించినట్లైతే రెండు రకాల దుఃఖములను గురించి రాయబడింది. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము
మరియు లోకసంబంధమైన దుఃఖము. దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు .
అయితే లోకసంబంధమైన దుఃఖము
మరణమును కలుగజేయును
2కోరింధి.7:10.
పై వాక్యమును బట్టి చూసినట్టైతే
పౌలు తన హృదయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది
మారుమనుస్సును కలుగజేస్తుందని కూడా పౌలే చెబుతున్నాడు. మరి నీ హృదయంలో ఎలాంటి
దుఃఖముంది? మారుమనుసు కొరకైనా దుఃఖమా? లేక ఐహిక విచారలముల
కొరకైనా దుఃఖమా? దైవ
చిత్తానుసారమైన దుఃఖమైతే అది కేవలం నీ గురించి మాత్రమే కాకుండా నీ పొరుగు వారి
క్షేమం కొరకు కూడా ఉంటుంది. నశించిపోతున్న ప్రజల కొరకు ,
పాపంతో నిండిపోయిన లోకం కొరకు, కాలమునకు ముందే చనిపోతున్న
వారి కొరకు హృదయములో భారము కలిగి దుఃఖం కలుగుతుంది.
యెరుషలేము యొక్క ప్రాకారములు
పడద్రోయబడినవని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నెహెమ్యా విన్నప్పుడు అతని
హృదయం దుఃఖముతో నిండిపోయింది (నెహెమ్యా.1:3,4).
తన ప్రజలకు కలిగియున్న శ్రమను
చూడగా యిర్మీయా యొక్క హృదయములో దుఃఖము కలిగి కన్నీటితో తన కన్నులు
క్షీణించిపోయాయి. అందుకే అతనిని విలపించే ప్రవక్త అని పిలుస్తారు. దైవ చిత్తానుసారమైన
దుఃఖములో ఇతరుల క్షేమం కూడా కనిపిస్తుంది. వారి మనుసులో మార్పు కలుగుతుంది.
కొంత మందికి లోకపరమైన దుఃఖము
కలుగుతుంది. అది బ్రతుకు మీద విరక్తిని
కలిగించి మరణానికి దారి తీస్తుంది. జీవితంలో నెమ్మది లేక, కుటుంబంలో
సంతోషం లేక, ఇతరులతో సమాధానం లేక,
జీవితంలో ఓడిపోయారని, ఉద్యోగం రాలేదని,
పెళ్లి కాలేదని, ప్రేమించిన వాళ్ళు ఒప్పుకోలేదని ఇలా ఎన్నో
కారణాలతో హృదయమును గాయపరుచుకొని దుఃఖముతో జీవిస్తూ ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.
వారి హృదయములో అంతా కూడా లోక సంబంధమైన దుఃఖమే నిండి ఉంది.
ఈ రోజు దేవుడు నిన్ను
ప్రశ్నిస్తున్నాడు. నీ హృదయం ఎలాంటి దుఃఖముతో నిండి ఉంది? లోక
సంబంధమైన దుఃఖమే కనుక ఉంటే నేడే ఆయన దగ్గరకురా. అది దైవ చిత్తానుసారమైన దుఃఖముగా
మార్చబడి నిన్ను బ్రతికిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖములో నీవు నీ పాపములను
ఆయన దగ్గర ఒప్పుకొని క్షమించమని వేడుకుంటావు. నీ మనివి అలకించే దేవుడు నీ హృదయమును
పరిశోధించే దేవుడు నీలో ఉన్న లోక సంబంధమైన దుఃఖమును తొలగిస్తాడు. అప్పుడు నీలో
కలిగే మార్పును నీవే నమ్మలేకపోతావు.
మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ
దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టిదోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహ మును ఎట్టి
భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు
నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి.
2కోరింధీ.7:11.
దైవ చిత్తనుసారముగా కలిగిన
దుఃఖము ద్వారా నీవు ఎన్నో మేలులు అనుభవిస్తావు. మారుమనసు పొందుకుంటావు. మారు మనసు
పొందుకున్న నీ హృదయంలో పాప సంబంధమైన ప్రతి అపవిత్రత తొలగింపబడుతుంది. నీ హృదయంలో
మంచి మాత్రమే నిండుతుంది. అప్పుడు నీ నోటి నుండి మంచి మాటలే తప్ప అపవాది సంబంధమైన
మాటలు రావు.
దేవుని కృప మీకందరికి తోడైయుండును గాక ! అమెన్ !!
మీ
సహోదరుడు లాజర్.
జీవధారలు
నీ హృదయములోనుండి
జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకొనుము. సామెతలు. 4:23
ధ్యానాంశం : హృదయం ( నాలుగవ భాగం )
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా
హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. కీర్తన.119:11.
ప్రియులారా! ఇంతకు ముందు
భాగములలో మనం ఎన్నో విషయాలను గురించి తెలుసుకున్నాము కదా. దేవుడు భూమి మీద
చూసినప్పుడు నరుల యొక్క హృదయం బాల్యము నుండే చెడ్డది గాను వారి తలంపుల యొక్క ఊహ
కూడా కేవలం చెడ్డదిగా కనపడింది. (ఆది.6:5)
అయితే ఇంత భయంకరమైన లోకములో
కూడా కొంత మంది మన పితరులు దేవునికి భయపడి ఆయన వాక్యమును వారి హృదయములలో ఉంచుకొని
పాపమునకు చోటివ్వకుండా బ్రతికారు. ఈ రోజుల్లో ఉన్నంత పాపపు సాధనాలు వారి కాలములో
లేవు అయిన వారి హృదయముల నిండా పాపం పాతుకుపోయింది. ఎంతల అంటే లోతు ఇంటికి వచ్చిన
దూతలను కూడటానికి సోదోమ పట్టణంలో ఉన్న బాలురులు సహితం కదిలి వచ్చారు. ఎంత హృదయ
విదారకరమైన సంఘటన? అంతా చిన్న పసి హృదయాలలో పాపం చేయాలనే తలంపును కోరికను
కలిగించింది ఎవరు?
ఇలాంటి సంఘటననే మనం
న్యాయాదిపతుల కాలంలో కూడా చూస్తాము. ఒక వ్యక్తి తన ఉపపత్నితో కూడా బెత్లెహేమూ
నుండి ప్రయాణమై ఎఫ్రాయిముకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో చీకటైనందున గిబియాలో బస చేయాలని అనుకున్నారు. అయితే ఆ
చోటి ప్రజలు ఎవరు కూడా వారిని పిలువలేదు. చివరికి ఒక ముసలివాని ద్వారా అతని దగ్గర
బస చేయడానికి అనుమతి తీసుకుంటాడు. ఆ మనుష్యుడు సంతోషంగా వారికి ఆతిథ్యమిచ్చాక ఆ ఊరిలో
ఉన్న కొందరు పోకిరులు ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు బయటకు పంపించుమని
గొడవ చేస్తారు.
అయితే ఆ ఇంటి యజమాని ఇది తప్పు.
అతడు నా అతిథుడు. మీరు ఇలాంటి దుష్కార్యము చేయకూడదు. కావాలంటే నా ఇద్దరు కూతుర్లను
లేదా ఆ వ్యక్తి ఉపపత్ని ఉన్నారు. వారిని మీకు మనసు వచ్చినట్లుగా చేసుకొండని
చెబుతాడు. అయితే ఆ పోకిరులు చివరికి ఉపపత్నిని రాత్రి అంతయు వారికి ఇష్టం
వచ్చినట్లు చేసి ఆమెను కొర ప్రాణములతో వదిలివెళ్లారు. ఈ సంఘటనను మనం న్యాయాధిపతుల
గ్రంధం 19వ అధ్యాయములో చూస్తాము.
చూశారా! వారి హృదయంలో ఎంత పాపం
నిండి ఉంటే మాత్రం ఇలాంటి ఘోరమైన పని చేస్తారు? అందుకనే దేవుడు “నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా
చూచి… ఆదికాండము.6:5” అంటున్నాడు.
అంతా మాత్రమే కాదు “నరుల హృదయాలోచన వారి
బాల్యమునుండి చెడ్డది.ఆదికాండము.8:21” అని కూడా
అంటున్నాడు.
చిన్నతనంలోనే హత్యలు చేయడం, మానభంగాలు
చేయడం, దోపిడులు చేయడం లాంటి భయంకరమైన పాపాలు చేస్తున్నాడు.
కారణం వారి హృదయంలో భయం లేకపోవడమే కదా! వారిని మంచి మార్గంలో నడిపించేవారు
లేకపోవడమే కదా! అందుకే సర్వమునెరిగినవాడు సర్వ సృష్టికర్తయైన దేవుడు చిన్నతనము
నుండే వారిని మంచి మార్గంలో నడిపించమని చెప్పాడు.
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము
వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. సామెతలు.22:6.
దేవుడు బాలుడు ఎలాంటి త్రోవలో
నడవలో నడిపించాలో చెబుతున్నాడు. చిన్నతనం నుండే మాట విని పెరుగుతుంటే పెద్దవాడైన
వాడు ఎడైతే నేర్చుకున్నాడో అదే చేస్తాడు. మరి నీ పిల్లకు ఏం నేర్పిస్తున్నారు? ముద్దు
ముద్దుగా మాటలు నెరుస్తున్నప్పటి నుండే బూతులు, తప్పటడుగులు
వేస్తున్నప్పటినుండే మోసం చేయడం, నిలబడే వయసులో తాగడం
ఇలాంటివెన్నో జరుగుతున్నాయి. చిన్నతనంలో నువ్వు ఎదైతే నేర్చుకుంటావో లేక
నేర్పిస్తావో అదే జీవితాంతం వరకు నిన్ను వెంబడిస్తుంది. అందుకే దేవుడు మోషేకు
ఇచ్చిన ధర్మశాష్త్రములో వీటన్నిటిని గురించి చెపుతూ ఇంకో మాట కూడా రాయించాడు.
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ
హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును
లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ
చేతికి కట్టు కొనవలెను. అవి నీ కన్నుల నడుమ
బాసికమువలె ఉండవలెను. ద్వితీ.6:6-8.
పిల్లలకు చిన్న తనం నుండే వాక్య
భయం ఉండాలి. వాక్యం వారిలో నింపబడితే ఇలాంటి పాపపు పనులు చేయలేరు. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును
పుట్టించుచున్నది. కీర్తన.119:38.
దైవికమైన భయం వలన పాపపు జీవితం
ఉండదు. నీ హృదయంలో దేవుని గురించిన భయం ఉంటే దేవుని గురించిన భయమే బయటకు వస్తుంది.
కాబట్టి హృదయం దైవికమైన మాటలతో నింపబడుతుంది. అప్పుడు నీ నోరు కూడా అదే
మాటలాడుతుంది. అందుకే హృదయంతో చాలా జాగ్రతగా ఉండాలి.
దావీదు దేవుని యెదుట పాపం
చేయకుండా తన హృదయంలో వాక్యమును నింపుకుందునని అంటున్నాడు. మరి దేవుని యెదుట నీ
హృదయంలో ఏం నింపుకొని ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ ఇదే నీకు అనుకూలమైన
సమయం. నేడే రక్షణ దినం. ఇప్పుడే నీ మనసు మార్చుకో. ఇకనైనా నీ హృదయం దేవుని యెదుట
నీతి ప్రవర్తన కలిగిన వాడిగా ఉండనిమ్ము. పాపపు హృదయం,
దుఃఖకరమైన హృదయం, వీటిని తీసివేసి వాక్యముతో నింపబడిన హృదయం
కలిగిన వారముగా జీవించుదాము.
దేవుని
కృప మీకందరికి తోడై యుండును గాక ! అమెన్ !!!
మీ
సహోదరుడు లాజర్.
జీవధారలు
నీ హృదయములోనుండి
జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకొనుము. సామెతలు. 4:23
ధ్యానాంశం : హృదయం ( అయిదవ భాగం )
నూతన హృదయము మీకిచ్చెదను. యెహెజ్కెలు.36:26.
అపవిత్రమైన మన హృదయంలో నుండి
పాప సంబంధమైన ప్రతి విషయం బయటకు వచ్చి మనల్ని అపవిత్ర పరుస్తుంది. అందుకే దేవుడు
చెడుతనం కలిగిన హృదయమును తీసివేసి నూతన హృదయమును ఇస్తానని చెబుతున్నాడు.
ఎందుకంటే నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై
యుండుడని వ్రాయబడియున్నది (1పేతురు.1:14).
మనలో పరిశుద్దత ఉండాలంటే ముందు మన హృదయం పరిశుద్దంగా ఉండాలి. చూసే చూపులో పవిత్రత , మాట్లాడే మాటలో పవిత్రత, ఆలోచించే ఆలోచనలో పవిత్రత, మన నడవడికలో పవిత్రత
ఇవన్నీ కూడా మన హృదయం మీదనే ఆధారపడి ఉంటాయి. వాటిని మనం ఎలా విడిచిపెట్టాలో
ప్రభువు ముందుగానే మనకు బోధించాడు.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది
ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడేవడు? యిర్మియా.17:9.
మన హృదయమే మనల్ని ఎన్నో సార్లు మోసం
చేస్తుంది. పవిత్రంగానే జీవస్తున్నామనే భ్రమలో
మనల్ని ఉంచుతుంది. కానీ దేవునికి మనల్ని దూరం చేస్తుంది. ఆనాడు సాతానుడు
పాము రూపంలో హవ్వని మోసం చేస్తే ఈనాడు హృదయం రూపంలో మనల్ని మోసం చేస్తున్నాడు.
ప్రార్థన చేయకపోయిన పర్వాలేదు, చర్చ్ కి వెళ్లకపోయిన
పర్వాలేదు, పాటలు పాడకపోయిన పర్వాలేదు,
ఆత్మీయంగా ఉండకపోయిన పర్వాలేదు, లోకనుసారంగా బ్రతికిన
పర్వాలేదు, కేవలం దేవుణ్ణి నమ్మితే చాలు పరలోకం
వెళ్లిపోవచ్చనే భ్రమను మన హృదయంలో కలిగించి ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడు. వాడి
చేతిలో మోసపోతూనే ఉన్నాము. మోసకరమైన హృదయంతో కొందరు తమకు తామే మోసపోతుంటే కొందరు
మాత్రం ఏకంగా దేవుడినే మోసం చేయాలని చూస్తున్నారు.
అననీయ సప్పిరాలు పరిశుద్దత్మనే మోసం చేసిన
రీతిగా నేటి సమాజంలో కూడా చాలా మంది క్రైస్తవులు అలానే చేస్తూ ఉన్నారు. కానీ
దేవుడు హృదయాలను ఎరిగిన వాడు. నీవు దేవుడిని మోసం చేయలేవు. దేవుని స్వరూపమందు
సృజింపబడిన నరుడిని నీవు మోసం చేస్తున్నావు. లేక నువ్వే మోసపోతున్నావు. కారణం
సాతానుడికి నీ హృదయంలో ఇంకా చోటు ఉందేమో? నీ హృదయం పరిశుద్దంగా
ఉండాలంటే ముందు నీ హృదయంలో ఎవరికి చోటు ఉందో గమనించు.
నిన్ను పరిశుద్ద పరచడానికే దేవుడు తన
రక్తమును కార్చాడు. ఆ రక్తములో కడగబడిన మనమందరం పరిశుద్దులము. అందుకే దేవుడు నూతన
హృదయమును నీకు ఇస్తా అంటున్నాడు.
ఇకనైనా
ప్రాచీన స్వభావమును విడిచిపెట్టు. దేవుడు నీకిచ్చిన నూతన హృదయమును భద్రముగా
కాపాడుకో. నీవు ఆ నూతన హృదయమును కాపాడుకోలేకపోతే తిరిగి సాతానుడు తన కంటే చెడ్డవైన
మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వస్తాడు.
హృదయంలో ఉన్న చెడుతనమును తొలగించాడు.
హృదయంలో ఉన్న దుఃఖమును తొలగించాడు. హృదయములో ఆయన వాక్యమును నింపాడు. మునుపెప్పుడు
చూడని నూతనమైన హృదయమునే దేవుడు నీకు ఇచ్చి, దానిని భద్రముగా కాపాడుకో అని కూడా చెబుతున్నాడు. అయిన కూడా
నీవు ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపితే దేవుడు విదించే శిక్షకు పాత్రుడవవుతావు.
హృదయం ధ్యానంశం సమాప్తం.
దేవుని
కృప మీకెల్లప్పుడు తోడై యుండును గాక ! అమెన్ !!
మీ
సహోదరుడు లాజర్.
No comments:
Post a Comment